పాకిస్థాన్ జెర్సీపై ధోనీ పేరు, నంబర్ : కొత్త పుంతలు తొక్కిన అభిమానం
టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీకి భారత్‌లో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాజీ సారథి క్రికెట్‌కు దూరమై దాదాపు 8 నెలలు కావస్తున్నా అతడి పునరాగమనం కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు అభిమానులు. మరోవైపు ధోనీపై అభిమానం దేశం దాటి పొరుగు దేశానికి చేరింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌లోనూ మహీకి అభిమానులున్నారని తెలుసు. అయితే, ఆ అభిమానాన్ని మరింత ప్రత్యేకంగా, వినూత్నంగా చాటుకోవడమే కొత్త విశేషం.
ప్రస్తుతం దాయాది దేశంలో పాకిస్థాన్ సూపర్ లీగ్ ఐదో సీజన్ జరుగుతుండగా ఇస్లామాబాద్ యునైటెడ్ ఇటీవల ముల్తాన్ సుల్తాన్‌తో తలపడింది. ఆ మ్యాచ్ చూడడానికి వచ్చిన ఇస్లామాబాద్ అభిమాని ఒకరు పాకిస్థాన్ జట్టు జెర్సీని ధరించాడు. దానిపై ధోనీపేరుతో సహా అతడి నంబర్ 7 ఉండటం విశేషం. మ్యాచ్ జరుగుతుండగా అతడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. దీంతో ధోనీపై ఉన్న అభిమానం కొత్త పుంతలు తొక్కింది. మరోవైపు ధోనీ క్రికెట్లో పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈనెల 29 నుంచి జరగబోయే ఐపీఎల్లో ఆడుతున్నాడు. ఇప్పటికే చెన్నై చేరుకున్న సీఎస్కే సారథి చెపాక్‌లో సాధన మొదలెట్టాడు. ముంబయి ఇండియన్స్‌తో ఆరంభ మ్యాచ్‌లో ధోనీ బరిలోకి దిగే అవకాశముంది.