తెలంగాణ బీజేపీకి కొత్త బాస్..

Spread the love

తెలంగాణ బీజేపీకి కొత్త బాస్ వచ్చారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ని నియమించింది బీజేపీ హైకమాండ్. లక్ష్మణ్ స్థానంలో బండి సంజయ్‌కు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా బాధ్యతలు అప్పగించారు. తక్షణం ఆయన రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా ఉన్నారు బండి సంజయ్. 2019 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్‌పై విజయం సాధించారు. గతంలో ఏబీవీపీ, యువమోర్చాలో ఆయన పనిచేశారు.


1971లో జన్మించిన బండి సంజయ్ కుమార్.. చిన్నతనం నుంచే RSSలో స్వయం సేవకుడిగా పనిచేశారు. 1994-2003 మధ్యకాలంలో ది కరీంనగర్ కో-ఓపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో రెండు సార్లు డైరెక్టర్‌గా పనిచేశారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల ప్రచార ఇంచార్జ్‌గానూ సేవలందించారు. ఆ తర్వాత భారతీయ జనతా యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షునిగా, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్‌గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్‌గా, జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ,తమిళనాడు ఇంచార్జి‌గా బాధ్యతలు చేపట్టారు.


కరీంనగర్ నగర పాలక సంస్థ‌గా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా 48వ డివిజన్ నుండి బిజెపి కార్పొరేటర్ మూడుసార్లు గెలిచారు. వరుసగా రెండు సార్లు నగర బిజెపి అధ్యక్షునిగా పనిచేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి..ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో 52,000 వేల పై చిలుకు ఓట్లు సాధించారు. 2019 ఎన్నికల్లో తిరిగి బిజెపి తరుపున కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి 66009 ఓట్లను సంపాదించి రెండవ స్థానంలో నిలిచారు. రాష్ట్రంలో పోటీ చేసిన బిజెపి అభ్యర్థుల్లో ప్రథమ స్థానం లో నిల్చున్నారు. ఇక 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి.. తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు బండి సంజయ్. ఇప్పటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా లక్ష్మణ్‌ కొనసాగగా ఇక నుంచి సంజయ్ ఆ పగ్గాలు చేపట్టనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *