చంద్రబాబుకు అరెస్టు నోటిసులేంటి.. హైకోర్టు మండిపాటు
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గత కొన్ని రోజులుగా ప్రజాచైతన్య యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే పోలీసులు వారి భద్రత దృష్ట్యా అరెస్టు చేయడంపై హై కోర్టు మండిపడింది. శాంతియుతంగా నిరసన తెలుపుకొనే అవకాశం ప్రతిపక్షానికి కూడా ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది. విశాఖలో చంద్రబాబు కాన్వాయ్ మీద కోడిగుడ్లు, టమాటాలు వేయడం, ఇతర పరిణామాల మీద ఇవాళ హైకోర్టులో విచారణ కొనసాగింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు.
2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన అనేక సంఘటనలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిన్న విశాఖలో వాటన్నిటికీ మించి జరిగిందని తెలిపారు. ప్రతిపక్షాల సభలకు అనుమతులు ఇవ్వకపోవడం, ఇచ్చినా చాలా కండిషన్లు పెట్టడం, ఆ కండిషన్లను ఉల్లంఘించారంటూ కేసులు పెడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. విశాఖలో ఆందోళనకారులను అరెస్ట్ చేయాల్సిన పోలీసులు సెక్షన్ 151 పేరు చెప్పి చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అధికార పార్టీకి చెందిన గొడవలు చేసిన వారిని వదిలేసి చంద్రబాబును కస్టడీలోకి తీసుకోవడం చట్టరీత్యా నేరమన్నారు. పైగా మీ భద్రత కోసమే అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పడాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది తప్పుపట్టారు. 151 సీఆర్పీసీ కింద ఒక వ్యక్తి నేరం చేయకుండా అడ్డుకోవడానికి, వారిని కంట్రోల్ చేయడానికి ఇచ్చే నోటీసు అని, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతకు ఆ నోటీసు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం 151 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చే అధికారం లేకపోయినా ఎందుకు నోటీసు ఇచ్చారని ప్రశ్నించింది. దీనిపై సమగ్రంగా అఫిడవిట్ దాఖలు చేయాలని డీజీపీ, విశాఖ సీపీని ఆదేశించింది. డీజీపీని వ్యక్తిగతంగా అఫిడవిట్ వేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది.
For more news :
Like us at Facebook Watch Us on YouTube Follow us on Twitter