ఏపీ డీజీపీ పై హైకోర్టు ప్రశ్నల వర్షం..ఆ వీడియోలు చూశారా?
ఏపీ పోలీస్ బాస్ గౌతం సవాంగ్‌పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. ఇదేనా పద్ధతి అని నిలదీసింది. అసలేం జరిగిందంటే..ఇటీవల నిరసన వ్యక్తం చేసేందుకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖకు వెళ్లటం.. ఆ సందర్భంగా ఆయనకు సీఆర్పీఎస్ సెక్షన్ 151 కింద నోటీసులు జారీ చేయటం హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ డీజీపీని హైకోర్టు స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. గురువారం ఉదయం 10.25 గంటలకు హైకోర్టుకు వచ్చిన డీజీపీ సాయంత్రం నాలుగు గంటల వరకూ ఉండాల్సి వచ్చింది. హైకోర్టు విచారణకు హాజరైన ఆయన.. ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వచ్చింది. ఈ సందర్భంగా కోర్టు అడిగిన ప్రశ్నలు.. వాటికి డీజీపీ ఇచ్చిన సమాధానాలు ఆసక్తికరంగా మారాయి.
పోలీసు చర్యల్ని హైకోర్టు ధర్మాసనం తీవ్రంగా తప్పు పట్టటమే కాదు.. విశాఖలో బాబును అరెస్టు చేసేందుకు ఇచ్చిన నోటీసుల్ని రాష్ట్ర డీజీపీ.. విశాఖ డీసీపీ చేత స్వయంగా చదివించారు. ఆనంతరం విచారణ సాగిన తీరు ఎలా ఉందంటే..
ధర్మాసనం: మీరు పెన్‌డ్రైవ్‌లో ఉన్న వీడియోను చూశారా?
డీజీపీ: చూశాను.
ధర్మాసనం: ఆ గ్రామంలో 500 మంది పోలీసులు ఎందుకున్నారు? అక్కడ అంతమంది అవసరమా? ఆ వీడియోలోని పోలీసు హెచ్చరికలు అభ్యంతరకరంగా ఉన్నాయి. అంత అవసరం ఏం వచ్చింది?
డీజీపీ: అది జనవరి 10 తేదీన… రాజధాని ఆందోళనలు మొదలైన 22 రోజుల తరువాత మందడంలో జరిగింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేశారు.
ధర్మాసనం: నిరసన ప్రశాంతంగా జరుగుతున్నప్పుడు అంతమంది పోలీసులతో ఫ్లాగ్ మార్చ్ జరపాల్సిన అవసరం ఏమొచ్చింది? పోలీసులు వ్యవహరించిన తీరు, వారి ప్రకటన మనం ప్రజాస్వామ్య దేశంలో లేమన్న భావన కలిగించేలా ఉంది. 500 మంది పోలీసులు కశ్మీర్లో ఫ్లాగ్‌మార్చ్ చేస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ ఇక్కడంత అవసరమేమొచ్చింది?
డీజీపీ: ఆ ఒక్కరోజే అలా జరిగింది.
ధర్మాసనం: ఒక్కరోజు కాదు. వరుసగా జరుగుతూనే ఉంది. మీరు రాష్ట్ర పోలీస్ శాఖకు అధిపతి. చట్టప్రకారం నడుచుకోనివారిపై చర్యలు తీసుకోండి. దీనిపై మళ్లీ మళ్లీ చెప్పబోం. ‘ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. కానీ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించకుంటే ఎలా? నిబంధనల మేరకు నడుచుకోవాల్సిందే. అది ఈ రోజు నుంచే ప్రారంభం కావాలి. మా ఆదేశాలు అమలు చేస్తారని ఆశిస్తున్నాం.
డీజీపీ: థ్యాంక్యూ సర్. చట్టాల్ని సక్రమంగా అమలు చేసే బాధ్యత తీసుకుంటాను. అది నా కర్తవ్యం. మీ ఆదేశాలను పాటిస్తాను.
-కె. మమత
For more news :
Like us at Facebook Watch Us on YouTube Follow us on Twitter